- ఆరు జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు, హీట్‌వేవ్స్
- అత్యధికంగా నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 45.6 డిగ్రీలు
- కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లోనూ 45కు పైగా నమోదు
- హైదరాబాద్ సిటీలోని 12 సర్కిళ్లలో 42 డిగ్రీలకు పైగా రికార్డ్
- ఫీల్ లైక్ టెంపరేచర్లు మాత్రం 45 డిగ్రీలుగా ఉన్నట్టు చెప్తున్న రిపోర్ట్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండ, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే మొదలవుతున్న ఎండ మంట సాయంత్రం 7 దాటినా తగ్గడం లేదు. పశ్చిమ ప్రాంతం నుంచి వీస్తున్న పొడిగాలులతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని వెదర్ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. సోమవారం ఆరు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 45.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 45.5, ఆదిలాబాద్ జిల్లా పొచ్చరలో 45.4, నిర్మల్ జిల్లా నర్సాపూర్ లో 45.2, జగిత్యాల జిల్లా ఐలాపూర్ లో 45, సిద్దిపేట జిల్లా ములుగులో 45 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు
నమోదయ్యాయి.
ఆరు జిల్లాల్లో 41, మరో మూడు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, 45 డిగ్రీలు దాటిన ఆ ఆరు జిల్లాల్లో హీట్ వేవ్ పరిస్థితులు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.
మరో నాలుగు రోజులపాటు హీట్ వేవ్స్ కొనసాగుతాయని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కుమ్రంభీం, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు రెండు రోజులకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆ తర్వాత రెండు రోజులు.. ఆయా జిల్లాలతో పాటు మహబూబాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాలకు హెచ్చరిక జారీ చేసింది.
హైదరాబాద్ మస్తు ఎండ
హైదరాబాద్ సిటీలో సోమవారం ఉష్ణోగ్రతలు భారీగానే నమోదయ్యాయి. మొత్తం 30 సర్కిళ్లలోని 12 సర్కిళ్లలో 42 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. మెహిదీపట్నం, జూబ్లీహిల్స్, యూసఫ్ గూడ, కుత్బుల్లాపూర్, బేగంపేటలో అత్యధికంగా 42.4 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్అయింది. సరూర్ నగర్, కర్వన్, అంబర్ పెట్ లలో 42.3, చాంద్రాయణగుట్ట, సికింద్రాబాద్, చందానగర్ లో 42.2, ముషీరాబాద్ లో 42.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హయత్ నగర్, మలక్ పెట్, గోషామహల్, మల్కాజిగిరిలో 41.9 డిగ్రీల మేర గరిష్ట టెంపరేచర్లు రికార్డయ్యాయి. అయితే గరిష్టంగా 42 డిగ్రీలకన్నా ఎక్కువున్నా.. అర్బనైజేషన్ కారణంగా ‘ఫీల్ లైక్’ టెంపరేచర్లు మాత్రం 45 డిగ్రీలకన్నా ఎక్కువగా ఉన్నట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి.
ఇది ఒక ప్రమాదకర హెచ్చరిక..
మనం ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితులకు చేరుకున్నాం. 20 ఏళ్ల కిందట 42 డిగ్రీల టెంపరేచర్ నమోదైతేనే అది హైయెస్ట్ అని చెప్పుకునేవాళ్లం, కానీ ఇప్పుడు 40 నుంచి 42 డిగ్రీలు అనేది చాలా సాధారణమైపోయింది. అసలు మనకు రోహిణి కార్తె ఇంకా రాలేదు.. కానీ అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఇది ఒక ప్రమాదకర హెచ్చరిక. వాతావరణ మార్పులే ఈ వేడి పెరగడానికి కారణం. మన మానవ తప్పిదాలను గుర్తించకపోవడం వల్లే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
అత్యధిక అటవీ ప్రాంతం ఉన్న ఆదిలాబాద్‌లోనే రికార్డ్ స్థాయిలో 44 డిగ్రీల ఎండలు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం సౌత్ లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. నౌ ఆర్ నెవర్ అన్నట్లుగా ఇప్పుడు గనక మనం చర్యలు తీసుకోకపోతే భావితరాలకు కోలుకోలేని నష్టం చేసినవారమవుతాం. అర్బన్ ఏరియాల్లో ఓపెన్ పార్కులు లేకపోవడం, ఇళ్ల నిర్మాణాల్లో వెంటిలేషన్, క్రాస్ వెంటిలేషన్ ప్లానింగ్ అస్సలు లేకపోవడం వల్ల వేడి గాలులు చుట్టుముడుతున్నాయి.
దీనివల్ల ఏసీల మీద భారం పడి.. అవి పేలిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ ప్లానింగ్ ను మార్చుకుని ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ పై ఫోకస్ పెట్టాలి. టిష్యూ కల్చర్, గ్రాఫ్టింగ్ పద్ధతిలో పొంగేనియా (కానుగ) వంటి మొక్కలను పెంచాలి. ఇవి 6 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించగలవు. సిటీలో వేస్ట్ హీట్ రికవరీ విధానాన్ని ప్రోత్సహించాలి. ఎలక్ట్రికల్ కేబుల్ ఆడిటింగ్ నిర్వహించాలి. చెరువుల్లో వాటర్ క్వాలిటీని పెంచాలి. హీట్ నుంచి రక్షించుకోవాలంటే ప్రకృతిని కాపాడుకోవడం ఒక్కటే మార్గం.
- బీవీ సుబ్బరావు, ఎన్విరాన్మెంటలిస్ట్ -
